ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి ప్రతిపాదిత రైలు మార్గం ఏర్పాటులో కీలక అడుగుపడింది. 2016-17 బడ్జెట్‌లో ఆమోదం లభించిన అమరావతికి అనుసంధాన మార్గం సర్వే పూర్తయ్యింది. రాష్ట్రీయ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) సర్వే నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. ఇందులో అమరావతికి రైలు మార్గం అనుసంధానంపై మూడు మార్గాల్లో కీలక ప్రతిపాదనలు చేసింది.

ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈలోగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటే.. కొత్త రైలు మార్గాన్ని కొద్దిరోజుల్లోనే మంజూరుచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ సచివాలయానికి, రాజధాని ప్రాంతానికి రావాలంటే విజయవాడ వరకు లేదంటే, గుంటూరు వరకే రైలు మార్గం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి రహదారి మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అమరావతికి నూతన రైలు మార్గాల ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడితే..నిర్మాణం చేపట్టి, పూర్తిచేసేందుకు నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని ఆర్‌వీఎన్‌ఎల్‌ అంచనా వేసింది. ఇవన్ని కార్యరూపం దాలిస్తే 2021-22 నాటికి అమరావతికి రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయి.

రూ. 2,679 కోట్ల వ్యయం: అమరావతికి ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా మూడు మార్గాలను ఆర్‌వీఎన్‌ఎల్‌ సర్వే చేసి, అలైన్‌మెంట్‌ ఖరారు చేసింది. మొత్తంగా 106 రూట్‌ కిలోమీటర్ల మేర ట్రాక్‌ వేయాల్సి ఉంటుందని లెక్క తేల్చింది. నంబూరు – అమరావతి – ఎర్రుపాలెం రెండు వరుసల లైన్‌ను లెక్కవేస్తే.. 189 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ వేయాల్సి ఉంటుంది. మొత్తంగా రూ. 2,679 కోట్ల వ్యయం కానుందని అంచనా వేసింది.

నంబూరు-అమరావతి-ఎర్రుపాలెం: విజయవాడ నుంచి గుంటూరుకు రైలు మార్గం ఉంది. ఈ దారిలో నంబూరు స్టేషన్‌ నుంచి అమరావతికి.. అక్కడి నుంచి ఎర్రుపాలం వరకు కొత్త రైలు మార్గం. గుంటూరు వైపు నుంచి, విజయవాడ వైపు నుంచి నంబూరు మార్గంలో వచ్చేవారు.. ఇక్కడి నుంచి అమరావతికి చేరుకోవచ్చు. మధిర, ఖాజీపేట, వరంగల్‌ ఆపై రూట్ల నుంచి వచ్చే రైళ్లు విజయవాడ వరకు వెళ్లల్సిన అవసరం లేకుండానే నేరుగా అమరావతి వైపు కొత్త లైన్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుతం రాయలసీమలోని ధర్మవరం, అనంతపురం వైపు నుంచి రైళ్లు.. నంద్యాల, నరసరావుపేట, నల్లపాడు, గుంటూరు, నంబూరు మీదుగా విజయవాడకు వెళుతున్నాయి. అమరావతికి వెళ్లాలంటే గుంటూరులో కానీ, విజయవాడలో గానీ దిగి రోడ్డు మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి.

నరసరావుపేట-సత్తెనపల్లి: గుంటూరు స్టేషన్‌కు ఇప్పటికే సామర్థ్యానికి మించి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. నరసరావుపేట-సత్తెనపల్లి మధ్య ప్రతిపాదిత ప్రాజెక్టును మంజూరుచేస్తే..ఈ రెండు ప్రాంతాల మధ్య కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం జరుగుతుంది. ఇదే జరిగితే రాయలసీమ వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. నంద్యాల, నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి.. అక్కడి నుంచి పెదకూరపాడుకు.. అక్కడి నుంచి ప్రతిపాదిత పెదకూరపాడు-అమరావతి లైన్‌లో రాజధాని ప్రాంతానికి చేరొచ్చు. రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరు వరకు వెళ్లనవసరం లేకుండానే ప్రత్యామ్నాయ మార్గంలో అమరావతి వరకు నేరుగా చేరుకోవచ్చు. గుంటూరు బైపాస్‌ అవుతుంది. దీనివల్ల ఈ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. రాయలసీమ నుంచి అమరావతికి వెళ్లేవారికి దూరం కూడా తగ్గుతుంది.

పెదకూరపాడు-అమరావతి: ఈ ప్రతిపాదిత నిర్మాణం పూర్తయితే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ వైపు నుంచి నల్గొండ మీదుగా వచ్చే రైళ్లను నేరుగా అమరావతికి నడిపించే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది.

railway information from amaravati route map

article source by:  http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=6

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

*